Posts

Daily Current Affairs in Telugu: 25th ఫిబ్రవరి 2023

Abdul Nazeer: ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారంఏపీ గవర్నర్‌గా ఫిబ్రవరి 24వ తేదీ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ‌భ‌వన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. 1983లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. HCA Film Awards: ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో 4 అంతర్జాతీయ అవార్డులు అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటుతోంది. ఈ సినిమా  ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవ‌డంతో పాటు, ఓ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమాను తాజాగా మరో నాలుగు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ (HCA) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో  RRR  సినిమా అవార్డులు గెలుచుకుంది. దీంతో ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌కు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. ద‌ర్శ‌కుడు రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు.  కాగా బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ  RRR సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌ సినిమా అవార్డులు పొందాయి. హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో పలు విభాగాల్లో విదేశీ చిత్రాలను వెనక్కు నెట్టి మ‌న తెలుగు సినిమా విజయాన్ని అందుకుంది. కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అవార్డ్ అందుకున్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌లోని స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన హెచ్‌సీఏకు కృతజ్ఞతలు తెలిపారు. Air India Recruitment: ఎయిర్‌ ఇండియా భారీ నియామకాలు.. 15 వారాల పాటు శిక్షణ విమానయాన రంగ సంస్థ ఎయిర్‌ ఇండియా కొత్తగా 5,100 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వీరిలో 900 మంది పైలట్లతోసహా 4,200 మంది విమాన సిబ్బందిని (క్యాబిన్‌ క్రూ) చేర్చుకోనున్నట్టు వెల్లడించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌ నుంచి 470 విమానాలను ఎయిర్‌ ఇండియా సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీయంగా, అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తున్నందున కొత్త నియామకాలు చేపట్టినట్టు  ఎయిర్‌ ఇండియా తెలిపింది. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య 1,900 మందికి పైగా విమాన సిబ్బందిని కంపెనీ చేర్చుకుంది. అభ్యర్థులకు ముంబైలోని ఎయిర్‌ ఇండియా ట్రెయినింగ్‌ సెంటర్‌లో 15 వారాల పాటు తరగతి గది, ఇన్‌ఫ్లైట్‌ శిక్షణ ఇస్తారు.Qatar Open: ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీ విజేత‌గా బోపన్న–ఎబ్డెన్‌ జోడీభారత సీనియర్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న తన కెరీర్‌లో 23వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. దోహాలో ఫిబ్ర‌వ‌రి 25న‌ జరిగిన ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కాన్‌స్టంట్‌ లెస్టిన్‌ (ఫ్రాన్స్‌)–బోటిక్‌ జాండ్‌షుల్ప్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్‌లకు 72,780 డాలర్ల (రూ.60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.  Shaktikanta Das: ఎకానమీ సవాళ్లను పరిష్కరించాలి.. జీ20 దేశాలకు ఆర్‌బీఐ గవర్నర్ సూచన!అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌ ఇటీవలి నెలల్లో మెరుగుపడినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్ అన్నారు. గ్లోబల్‌ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు, ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను దృఢ సంకల్పంతో పరిష్కరించాలని కూడా జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీసీ) ప్రారంభ సమావేశంలో దాస్‌ చేసిన ప్రసంగ ముఖ్యాంశాలు..• ప్రపంచం తీవ్ర మాంద్యం నుంచి తప్పించుకోవచ్చని, వృద్ధి మందగమనం లేదా అంతగా తీవ్రత లేని మాంద్యం పరిస్థితులే సంభవించవచ్చని ఇప్పుడు గొప్ప ఆశావాదం ఉంది. అయితే, ఇంకా అనిశ్చిత పరిస్థితులు మన ముందు ఉన్నాయి. • మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను మనం కలిసికట్టుగా దృఢంగా పరిష్కరించాలి. ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు, రుణ ఇబ్బందులు, క్లైమాట్‌ ఫైనాన్స్, వాణిజ్య రంగంలో పరస్పర సహకారం లోపించడం, గ్లోబల్‌ సరఫరాల సమస్యలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పటిష్ట ప్రపంచ ఆర్థిక సహకారంతో ప్రపంచ వృద్ధి విస్తృత స్థాయిలో మెరుగుపరచడం సాధ్యమవుతుంది.  • జీ20 గ్రూప్‌ ప్రస్తుతం పరివర్తన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి జీ20 ఒక బహుపాక్షిక ఫోరమ్‌గా అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది.Narendra Modi: మోయలేని రుణ భారంతో దేశాలే తలకిందులు.. మోదీ మోయలేని రుణ భారం దెబ్బకు పలు వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా ఇది ప్రమాద సంకేతమేనన్నారు. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ బెంగళూరులో మొదలైన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండు రోజుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. మితిమీరిన అప్పులకు కరోనా కల్లోలం వంటివి శ్రీలంక దివాలా తీయడం, పాకిస్తాన్‌ కూడా అదే బాటన ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి స్థిరత్వంతో కూడిన వృద్ధి బాట పట్టించడం, దానిపై విశ్వాసం పాదుగొల్పడం సంపన్న దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బాధ్యతేనని ఆయన హితవు పలికారు. ‘‘ఇదంత సులభం కాదు. కానీ నిర్మాణాత్మక ప్రయత్నం జరిగి తీరాలి. అయితే కాలానుగుణంగా సంస్కరించుకుని మారడంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వెనకబడటంతో వాటిపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనిపైనా దృష్టి పెట్టాలి’’ అని అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పుల విపత్తునూ సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో పలుచోట్ల భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కనీస సౌకర్యాలకూ నోచుకోక అలమటిస్తున్న దుర్బల ప్రజానీకాన్ని ఆదుకోవడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు.Ukraine-Russia Crisis: ఉక్రెయిన్‌పై తీర్మానానికి భారత్‌ దూరం ఉక్రెయిన్‌లో యుద్ధానికి తక్షణం తెర పడి సమగ్ర, శాశ్వత శాంతి నెలకొనాల్సిన అవసరముందంటూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఫిబ్ర‌వ‌రి 23న చేసిన తీర్మానానికి భారత్‌ దూరంగా ఉంది. తీర్మానంలోని వ్యవస్థాగతమైన పరిమితుల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 193 సభ్య దేశాల్లో మరో 31 దేశాలు భారత్‌ బాటన నడిచాయి. తీర్మానానికి అనుకూలంగా 141 ఓట్లు, వ్యతిరేకంగా ఏడు ఓట్లు వచ్చాయి. దీనికి మద్దతివ్వాల్సిందిగా ఉక్రెయిన్‌తో పాటు అమెరికా, జర్మనీ తదితర దేశాలు భారత్‌ను కోరాయి. రష్యా, ఉక్రెయిన్‌ రెండింటికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మనం కనీసం దగ్గరగానైనా వచ్చామా అన్నది ఆలోచించాల్సిన అంశమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాం¿ోజ్‌ ఈ సందర్భంగా సూచించారు.‘‘ఇరుపక్షాలనూ భాగస్వాములను చేయని ప్రక్రియతో ఫలితముంటుందా? ప్రపంచ శాంతిభద్రతలకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో ఐరాస భద్రతా మండలి విఫలమవుతుండటం చేదు నిజం కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఉక్రెయిన్‌ పరిణామాలపై భారత్‌ ఎంతో ఆందోళన చెందుతోంది. సమస్యకు చర్చలే పరిష్కారమన్నదే ముందునుంచీ భారత్‌ వైఖరి’’ అని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌పై గతంలో ఐరాస చేసిన తీర్మానాలకు కూడా భారత్‌ దూరంగానే ఉంది.

Daily GK in Telugu(25th Feb 2023)

1) తయమిన్ అనే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?జ : బేరి బేరి 2) నీ యాసీన్ అనే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది.?జ : పెల్లెగ్రా 3) న్యుమోనియా వ్యాధి ఏ సూక్ష్మజీవుల వలన కలుగుతుంది.?జ : హిమోఫిలస్ ఇన్‌ప్లూయోంజా 4) కలరా వ్యాధి ఏ సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది.?జ : విబ్రియో కలరా 5) దీప్తిరియా వ్యాధి ఏ సూక్ష్మజీవుల వలన కలుగుతుంది.?జ : కొరిని బ్యాక్టీరియం 6) FM ప్రసారం యొక్క పవన పుణ్య పట్టి ఎంత.?జ : 88-108 kHz 7) ద్రవం యొక్క ఏ ధర్మం కారణంగా నీటి బుడగలు గోళాకారంలో ఉంటాయి.?జ : తలతన్యత 8) వ్యాపార ఐరన్ యొక్క అతిశుద్ధమైన రూపము ఏమిటి?జ: చేత ఇనుము 9) ఋగ్వేద కాలంలో పచ్చిక బయళ్ళ మీద అధికారి ఎవరు.?జ : ప్రజాపతి 10) శృంగార నైషధం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?జ : శ్రీనాథుడు 11) కాకతీయుల మూల పురుషుడి గురించి పేర్కొన్న చాళుక్య శాసనం ఏది.?జ : మాంగల్లు శాసనం 12) 1857 తిరుగుబాటులో పాల్గొన్న రాణి అవంతిభాయ్ లోడి ఏ రాజ్యానికి పాలకురాలు.?జ : రామ్‌ఘర్ 13) భారతదేశానికి వాణిజ్య కేంద్రంగా ముంబైని చేసినది ఎవరు.?జ : గెరాల్డ్ అంగియాన్ 14) ‘అలంగీర్ నామా’ రచయిత ఎవరు.?జ : మిర్జా మహ్మద్ ఖాజీమ్ 15) బ్రహ్మ సమాజం యొక్క గ్రంథాలను తెలుగు తమిళ భాషలోకి అనువదించినది ఎవరు.?జ : చెంబటి శ్రీధరాలు నాయుడు 16) బార్డోలి సత్యగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది.?జ : 1928 17) 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని పరిశీలించిన అమెరికన్ జర్నలిస్ట్ ఎవరు.?జ : వెబ్ మెల్లర్ 18) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ భారత అటార్నీ జనరల్ పార్లమెంట్ లో ప్రసంగించే అధికారం కలిగి ఉన్నాడు.?జ : 88వ ఆర్టికల్ 19) ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ స్థానాలను 525 నుండి 545 కు పెంచడం జరిగింది.?జ : 31వ రాజ్యాంగ సవరణ 20) లోక్ సభ స్పీకర్ గా ఎక్కువ కాలం పని చేసిన వారు ఎవరు.?జ : బలరాం జక్కర్

Daily GK in Telugu(24th Feb 2023)

1) రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి స్థాపనకు ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది?జ : ఐక్యరాజ్యసమితి 2) ఐక్యరాజ్యసమితిలో ప్రధాన అంగాలు ఎన్ని.?జ : ఆరు3) గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?జ : అమస్టర్ డాం4) తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె ఎన్ని రోజులపాటు జరిగింది.?జ : 42 రోజులు 5) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ని చంద్రమండలం మీదకు పంపిన దేశం ఏది.?జ : అమెరికా 6) దేశంలో అతి పురాతన నది ఏది.?జ : గోదావరి 7) పశ్చిమ వైపు ప్రవహించే నదులలో అతి పెద్దది ఏది?జ : నర్మదా నది 8) నైరుతి రుతుపవనాలు ఏ సముద్రం నుంచి పుడతాయి.?జ : హిందూ మహాసముద్రం 9) థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది.?జ : లూని నది 10) కర్కట రేఖ మనదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది.?జ : ఎనిమిది రాష్ట్రాల గుండా 11) ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?జ : డిసెంబర్ 10 12) అస్పృశ్యత నిషేధం అనేది ఈ హక్కులో భాగం.?జ : సమానత్వపు హక్కు 13) మొదటి కర్మగారాల చట్టాన్ని ఎప్పుడు చేశారు.?జ : 1881 14) రైలు ఇంజన్ ను కనుగొన్నది ఎవరు?జ : జార్జ్ సిఫిన్ సన్ 15) ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించే ప్రామాణికం ఏమిటి?జ : తలసరి ఆదాయం 16) బుర్రకథ పితామహుడు అని ఎవరిని అంటారు.?జ : నాజర్ 17) ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్య హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది.?జ : 86 18) ఆదేశిక సూత్రాలలో పని హక్కు గురించి వివరించే ఆర్టికల్ ఏది?జ : ఆర్టికల్ 41 19) భారతదేశంలో మొత్తంలో లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఎంత.?జ : 543 20) కడవెండి అనే గ్రామంలో రైతుల ప్రదర్శనలపై జమీందారులు కాల్పులు జరుపగా అమరుడైన వ్యక్తి ఎవరు.?జ : దొడ్డి కొమరయ్య

Daily Current Affairs in Telugu: 24th ఫిబ్రవరి 2023

Sangeet Natak Akademi Awards: జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం..  కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఈ అవార్డులు ఇవ్వలేదు. దీంతో 2019, 2020, 2021 సంవత్సరానికి కలిపి ఒకేసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 128 మంది కళాకారులకు అవార్డులు అందజేశారు. ఈ అవార్డుల్లో ఆరు తెలుగు రాష్ట్రాల్లో కళా, సంగీత సేవ చేస్తున్న వారికి దక్కాయి.హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, కథక్ నృత్యకారులు రాఘవరాజ్ భట్, మంగళ భట్ (సంయుక్తంగా) 2019 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు అందుకోగా, 2020 సంవత్సరానికి కర్నాటక సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, ప్రఖ్యాత గాయని ప్రేమ రామ్మూర్తి, కూచిపూడి నృత్య కళాకారులు పసుమర్తి విఠల్, పసుమర్తి భారతి దంపతులు (సంయుక్తంగా) అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరానికి గానూ నాటక రంగాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్న వినాయక నాట్యమండలి (సురభి) నిర్వాహకులు ఆర్.వేణుగోపాల్ రావు సంగీత, నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డులు అందుకున్న 128 మంది కళాకారుల్లో 50 మంది మహిళలే ఉన్నారు. అజయ్ బంగా హైదరాబాద్, బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఐఐఎం ఢిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2009లో అజయ్ మాస్టర్ కార్డు సీఈఓగా పనిచేశారు. అంతకుముందు సిటీ గ్రూప్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ వ్యవహారాలు చూసేవారు. ప్రస్తుతం అజయ్ జనరల్‌ అట్లాంటిక్‌ వైస్‌–చైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో మాస్టర్‌కార్డ్‌ అధ్యక్షుడు, సీఈఓగా సేవలందించారు. 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో ప్రఖ్యాత పురస్కారాలు స్వీకరించారు.   Winter Storm: అమెరికాలో భీకర మంచు తుపాను.. విమాన సర్వీసులు రద్దు అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను(బ్లిజ్జార్డ్‌) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్‌ పలు చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియాల్లో విద్యుత్‌ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి.Fifth Layer of Earth: భూమికి ఐదో పొరను కనిపెట్టిన శాస్త్రవేత్తలుఅశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు.. భూమి తాలూకు ఇన్నర్‌ కోర్‌ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్‌ స్కేల్‌పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్‌ కోర్‌ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి.మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు! ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్‌ కోర్‌ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్‌ కోర్‌’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు.BioAsia 2023: ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. బయో ఆసియా–2023 సదస్సు ముఖ్యాంశాలు ‘బయో ఆసియా’ 20వ వార్షిక సదస్సు.. జీవశాస్త్ర, ఆరోగ్య రక్షణ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక. ఈ సదస్సు ‘బయో ఆసియా 2023’పేరిట, నాణ్యమైన వైద్యం.. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా.. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) ప్రాంగణంలో జరుగుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ప్రారంభించారు. ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌.. షేపింగ్‌ ది నెక్ట్స్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఇస్తున్న ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’పురస్కారాన్ని ఈసారి ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌కు అందజేయనున్నారు.సదస్సు నిర్వహణలో బ్రిటన్‌ భాగస్వామ్యం వహిస్తుండగా, స్థానిక పార్ట్‌నర్‌గా ప్లాండర్స్‌ వ్యవహరిస్తోంది. ప్రముఖ సంస్థ ‘ఆపిల్‌’ తొలిసారిగా బయో ఆసియా సదస్సులో పాల్గొంటోంది. నోవార్టిస్‌ సీఈఓ వాస్‌ నరసింహన్‌ కీలకోపన్యాసం చేస్తారు. ప్లీనరీ టాక్‌లో యూకేకి చెందిన డా.రిచర్డ్‌ హాచెట్‌ ప్రసంగిస్తారు.Forest Development Corporation: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు  తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఎఫ్‌డీసీకి జర్మనీ ఫారెస్ట్‌ స్టీవర్డ్‌ కౌన్సిల్‌ సర్టిఫికెట్‌ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు(ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్‌డీసీకి కౌన్సిల్‌ అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను ఉన్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వివరించారు.దీనివల్ల అంతర్జాతీయంగా ఎఫ్‌డీసీ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుందని, ఐకియా వంటి ఇంటర్నేషనల్‌ బ్రాండ్లకు జర్మన్‌ కౌన్సిల్‌ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందన్నారు. ఐదేళ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్‌ వుడ్‌పేపర్, ప్యాకింగ్‌ పరిశ్రమల కోసం ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తులకు అధికధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్‌ఎస్సీ ఆమోదం లభించిందని తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి అట‌వీ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో సింథటిక్‌ వజ్రాల ల్యాబ్‌.. రూ.243 కోట్లు వెచ్చింపుదేశీయంగా సింథటిక్‌ వజ్రాల తయారీకి సంబంధించిన సెంటర్‌ను (ఇన్‌సెంట్‌–ఎల్‌జీడీ) ఐఐటీ–మద్రాస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. దీనికి 5 ఏళ్లలో సుమారు రూ. 243 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా సింథటిక్‌ వజ్రాల తయారీ పరిశ్రమకు, వ్యాపారవేత్తలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించింది. స్టార్టప్‌లకు చౌకగా టెక్నాలజీని అందించేందుకు ఉపాధి అవకాశాలను, ఎల్‌జీడీ ఎగుమతులను పెంచేందుకు ఇన్‌సెంట్‌–ఎల్‌జీడీలో పరిశోధనలు ఉపయోగపడగలవని వాణిజ్య శాఖ తెలిపింది. ల్యాబ్స్‌లో తయారయ్యే వజ్రాలను ఆభరణాల పరిశ్రమలోనే కాకుండా కంప్యూటర్‌ చిప్‌లు, ఉపగ్రహాలు, 5జీ నెట్‌వర్క్‌లు మొదలైన వాటిల్లోనూ ఉపయోగిస్తారు.అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ 2020లో బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. 2025 నాటికి సింథటిక్‌ డైమండ్‌ ఆభరణాల మార్కెట్‌ 5 బిలియన్‌ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో వీటికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు 25.8% వాటా ఉంది. కెమికల్‌ వేపర్‌ డిపోజిషన్‌ (సీవీడీ) టెక్నాలజీతో వజ్రాలను తయారు చేసే టాప్‌ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. అయితే, కీలకయంత్ర పరికరాలు, ముడి వనరు అయిన సీడ్స్‌ కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. 

Daily Current Affairs in Telugu: 23rd ఫిబ్రవరి 2023

Earthquake: తజకిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం..తూర్పు తజకిస్తాన్‌లో ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ (గురువారం) రిక్టార్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, చైనా సరిహద్దుల్లోని గోర్నో-బదక్షన్‌లో భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.37 గంటలకు, భూ ఉపరితం నుంచి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం వచ్చిన మ‌రో 20 నిమిషాల తరువాత 5.0 తీవ్రతో మరో భూకంపం వచ్చింది. తక్కువ జనాభా కలిగి ఉన్న పామిర్ పర్వత ప్రాంతాల్లో భూకంపం రావడం వల్ల పెద్దగా నష్టం కలగలేదు. Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష బరిలో ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామిభారతీయ మూలాలున్న అమె రికన్‌ యువ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్‌. 37 ఏళ్ల వివేక్‌ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టారు. ‘ అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్‌ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్‌ ప్రైమ్‌టైమ్‌ షో సందర్భంగా వివేక్‌ వ్యాఖ్యానించారు.  Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) మేయర్‌ ఎన్నికలు ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ సజావుగా జ‌రిగాయి. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై ఆప్‌ మహిళా అభ్యర్థి షెల్లీ ఓబెరాయ్‌ 34 ఓట్ల తేడాతో నెగ్గి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 266 ఓట్లు పోలవగా షెల్లీకి 150, గుప్తాకు 116 ఓట్లు దక్కాయి. నామినేటెడ్‌ సభ్యులకూ ఓటింగ్‌ హక్కు ఉందంటూ బీజేపీ కార్పొరేటర్లు వాదించడం, అందుకు ఒప్పుకునేది లేదంటూ మెజారిటీ సభ్యులైన ఆప్‌ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగడంతో ఢిల్లీలోని సివిక్‌ సెంటర్‌ భవనంలో మేయర్, డెప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ గతంలో మూడుసార్లు అర్ధంతరంగా వాయిదాపడింది.  మేయర్‌ ఎన్నికలపై తేల్చాలంటూ ఆప్‌ అభ్యర్థి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా నామినేట్‌ చేసిన సభ్యులకు ఓటింగ్‌ హక్కులు ఉండబోమని సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న తేల్చిచెప్పడంతో మేయర్‌ ఎన్నిక కోసం సభను సమావేశపరచాలని ఎల్‌జీ ఆదేశాలివ్వడం, ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థి జయకేతనం ఎగరేయడం చకచకా జరిగిపోయాయి. డెప్యూటీ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి అలే మొహమ్మద్‌ ఇక్బాల్‌ గెలిచారు. ఎంసీడీ తొలి మేయర్‌గా ఎన్నికైన 39 ఏళ్ల షెల్లీ ఆప్‌ మహిళా అభ్యర్థిగా తూర్పు పటేల్‌నగర్‌ వార్డు నుంచి గెలిచారు. గతంలో ఈమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఇగ్నోలో డాక్టరేట్‌ చేశారు. ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌(ఐసీఏ)లో బంగారు పతకం సాధించారు.   Caste Discrimination: కులవివక్షను నిషేధించిన సియాటిల్‌ కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్‌ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్‌ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా సావంత్ ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్‌ టైమ్స్‌ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. 2018 అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి. Russia-Ukraine War: ఒక దురాక్రమణకు తలవంచని తెగువకు ఏడాది ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని రోజు 2022 ఫిబ్రవరి 24. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన రోజు. రష్యా అపార సాయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ నిలవలేదని, దాని ఓటమితో రోజుల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. దాదాపు ఏడాది గడిచాక.. పసికూనగా భావించిన ఉక్రెయిన్‌ పట్టువీడకుండా తెగించి పోరాడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాల సాయుధ, ఆర్థిక సాయం దన్నుతో రష్యాను దీటుగా ఎదిరిస్తోంది. పలు ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా సేనలను తరిమికొడుతూ మరిచిపోలేని పరాభవాలను పుతిన్‌కు రుచి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఎంతకాలమైనా ఉక్రెయిన్‌కు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తామంటూ పుతిన్‌ చేసుకున్న తాజా హెచ్చరికలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలనే గాక ప్రపంచ దేశాలన్నింటినీ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే. తొలిసారేమీ కాదు.. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు ఇదే తొలిసారేమీ కాదు. వెయ్యేళ్ల చరిత్ర, 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్‌ ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌(యూఎస్‌ఎస్‌ఆర్‌)లో అంతర్భాగమే. సోవియట్‌ పతనానంతరం 1990ల్లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పశ్చిమ దేశాల కుట్రల వల్లే ఉక్రెయిన్‌ తమకు దూరమైందని రష్యా ద్వేషం పెంచుకుంది. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్‌ కీలుబొమ్మ అని పుతిన్‌ తరచుగా విమర్శిస్తుంటారు. ఉక్రెయిన్‌ కృత్రిమంగా ఏర్పడ్డ దేశమని, నిజానికి అది, రష్యా ఒకే తల్లి బిడ్డలని ఆయన వాదిస్తుంటారు. రెండు దేశాలను ఎలాగైనా ఒక్కటి చేయాలన్నదే పుతిన్‌ ఆశయం. అందులో భాగంగానే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఆ ఘర్షణలో ఇరువైపులా వేలాది మంది మరణించారు. Shooting World Cup: ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో ప్రతాప్‌ సింగ్‌కు స్వర్ణం ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో భారత్‌ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. ఫిబ్ర‌వ‌రి 23న‌ జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో 22 ఏళ్ల ప్రతాప్‌ సింగ్‌ 16–6తో అలెగ్జాండర్‌ షిమిర్ల్‌ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో షిమిర్ల్, ప్రతాప్‌ సింగ్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌ చేరారు. భారత్‌కే చెందిన అఖిల్‌ షెరాన్‌ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ రెండో ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.  

Daily GK in Telugu(23rd Feb 2023)

1) హాకీ ని జాతీయ క్రీడగా భారతదేశం ఎప్పుడు స్వీకరించింది.?జ : 1925 2) తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని.?జ : థాయిలాండ్3) పర్వతాల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు.?జ : నేపాల్4) తుంబ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది.?జ : కేరళ 5) 1757లో ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది.?జ : సిరాజ్ ఉద్దౌలా & రాబర్ట్ క్లైవ్ 6) 40 మంది సైనికులు చనిపోయిన పుల్వామా దాడి ఏ రోజు జరిగింది.?జ : ఫిబ్రవరి – 14 – 2019 7) భారతదేశంలో “శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాన్ని” ఏ సంవత్సరంలో చేశారు.?జ : 1993 8) జాతీయ శాస్త్రీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు.?జ : 1958 9) π విలువ ను కనుగొన్న భారత శాస్త్రవేత్త ఎవరు.?జ : ఆర్యభట్ట 10) పరమాణు నిర్మాణం గురించి వివరించిన ప్రాచీన భారత శాస్త్రవేత్త ఎవరు.?జ : కనడ్ 11) నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?జ : కర్నాల్ (హర్యానా) 12) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది.?జ : హైదరాబాద్ (తెలంగాణ) 13) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధంగా దేశంలో ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి.?జ : 19 14) స్వతంత్రం వచ్చిన 1947వ సంవత్సరంలో దేశ అక్షరాస్యత శాతం ఎంత.?జ : 12 శాతం 15) ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు ఏ రోజున చేరుకుంది.?జ : నవంబర్ – 15 – 2022 16) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జన సాంద్రత ఎంత.?జ : 382 17) యాంటీబయోటిక్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు.?జ : వాక్స్ మెన్ 18) ప్లేగు వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా ఏది.?జ : పాస్టురెల్లా పెస్టిస్ 19) EXIM బ్యాంకు ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?జ : 1982 20) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ని ఏ సంవత్సరంలో స్థాపించారు.?జ : 1956

Daily Current Affairs in Telugu: 22nd ఫిబ్రవరి 2023

YSR Law Nestham: వ‌రుస‌గా నాలుగో ఏడాడి వైఎస్సార్‌ ‘లా నేస్తం’ నిధులు విడుదల వ‌రుస‌గా నాలుగో ఏడాడి వైఎస్సార్‌ ‘లా నేస్తం’ పథకం కింద అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభు­త్వం విడుదల చేసింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్ రెడ్డి ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ (బుధ‌వారం) సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయ­వాద వృత్తిలోకి వచ్చిన జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో ఎదు­రయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్‌ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున అందిస్తున్నారు. కాగా ఈ ప‌థ‌కం కింద ఇప్పటివరకు 4,248 మంది న్యాయ­వాదులకు మూడున్నరేళ్లలో రూ.35.40 కోట్లు ఆర్థిక సాయం అందించారు.అలాగే న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.­100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం అడ్వొకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్‌ సమ­యంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.  Sania Mirza: వండర్‌ ఉమన్ సానియా మీర్జా టెన్నిస్‌కు వీడ్కోలు.. ఆమె జీవిత విశేషాలివే..   సానియా మీర్జా అంటే మూడు డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 43 డబుల్స్‌ ట్రోఫీలు, 91 వారాలు వరల్డ్‌ నంబర్‌వన్‌ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 20 ఏళ్ల పాటు టెన్నిస్‌ సర్క్యూట్‌లో ప్రొఫెషనల్‌గా కొనసాగడం మాత్రమేనా? వీటన్నింటికి సమాధానం ‘కాదు’ మాత్రమే!   మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టడమే అరుదుగా అనిపించిన సమయంలో సానియా టెన్నిస్‌ను ఎంచుకొని కొత్త బాట వేసింది. తన ఆటను, తన సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె టెన్నిస్‌కే పరిమితం కాదు. భారత క్రీడలకే ఆమె ఒక ‘వండర్‌ ఉమన్‌’. ఎన్నో ఏళ్లుగా మహిళల క్రీడలకు సంబంధించి ఉన్న మూసను సానియా బద్దలు కొట్టింది. ఆటతోనే కాకుండా అవసరమైతే మాటతోనూ తలపడింది. తన స్థాయి ప్లేయర్‌ను ఒక ‘ఎర’గా వేశారంటూ పురుషాధిక్య సమాజపు నైజాన్ని నేరుగా ప్రశంసించింది. తన ఆటలో సంధించిన ఏస్‌ల తరహాలోనే మాటల్లో కూడా అంతే పదును చూపించింది.  ఎలాంటి టెన్నిస్‌ నేపథ్యం లేని నగరం నుంచి, సాంప్రదాయ కట్టుబాట్లతో కూడిన తన సొంత నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగిల్స్‌లో 27 వరకు, డబుల్స్‌లో నంబర్‌వన్‌ వరకు సానియా ఎదగగలిగింది. ఒక స్టార్‌గా, దిగ్గజంగా ఆటపై సానియా ముద్ర అసమానం. శ్రమించే తత్వం, పట్టుదలతో ఆమె సాధించిన ఘనతలు స్ఫూర్తిదాయకం. Shooting World Cup: ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో రుద్రాంక్ష్‌కు స్వ‌ర్ణం ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ భారత్‌ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ బాలాసాహెబ్‌ పాటిల్‌ పసిడి పతకం సాధించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ సేన్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో రుద్రాంక్ష్ 16–8తో మాక్సిమిలన్‌ ఉల్‌బ్రిచ్‌ (జర్మనీ)పై గెలిచాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో రుద్రాంక్ష్ 262 పాయింట్లు, ఉల్‌బ్రిచ్‌ 260.6 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. మిరాన్‌ మారిసిచ్ (క్రొయేషియా; 260.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. 74 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 629.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ రౌండ్‌కు చేరాడు. టాప్‌–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్‌ రౌండ్‌లో పోటీపడతారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో తిలోత్తమ సేన్‌ 262 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించిందిEarthquake: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం..   చెన్నైలో కూడాదేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ (బుధ‌వారం) మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కొన్ని సెకంన్ల‌ పాటు భూ ప్రకంపనలు వ‌చ్చాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్ర‌కారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదయింది. నేపాల్‌లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్క‌సారిగా కదల‌డంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల్లోని ప్రజలు భయంతో కేకలు వేస్తూ బయటకి పరుగులు తీశారు. కాగా ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చెన్నైలోనూ భూకంపంత‌మిళ‌నాడు రాజ‌దాని చెన్నైలోనూ భూమి కంపించ‌డంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం బయటికి పరుగులు తీశారు. మౌంట్‌, వైట్ రోడ్ల‌లో భూమి కంపించింది. అండ‌ర్ గ్రౌండ్ మెట్రో ప‌నుల కార‌ణంగానే భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెప్ప‌డంతో, కాద‌ని మెట్రో నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. Supreme Court: సుప్రీంకోర్టు కార్యకలాపాలకు ఇక అక్షరరూపం సుప్రీంకోర్టులో జరిగే కార్యకలాపాలు, వాదనలు, తీర్పులు ఎప్పటికప్పుడు అక్షరరూపంలోకి మారి, కక్షిదారులకు ప్రత్యక్షంగా కనిపించే విధానాన్ని ఫిబ్ర‌వ‌రి 21న‌ ప్రారంభించింది. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ), నేచురల్‌ లాంగ్వేజీ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. కోర్టులో పెద్ద తెర ఏర్పాటు చేశారు. వాదనలు, తీర్పులు ప్రత్యక్షంగా ఇందులో కనిపించాయి. అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు చెందిన కోర్టు రూమ్‌లో ఈ లైవ్‌ ట్రాన్ర్‌స్కిప్షన్‌కు శ్రీకారం చుట్టారు. మరో ఒకటి రెండు రోజులపాటు ప్రయోగం కొనసాగనుంది. సత్ఫలితాలు వస్తే శాశ్వతంగా అమలు చేయనున్నారు. వాదనలు, తీర్పులు రికార్డు రూపంలో ఉంటే న్యాయ కళాశాలలకు సైతం ప్రయోజనకరంగా ఉంటుందని సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.Vladimir Putin: ఉక్రెయిన్‌ పరిస్థితికి పశ్చిమ దేశాలే కార‌ణం.. పుతిన్‌ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభం కావడానికి, ఇదింకా కొనసాగుతుండటానికి అవే బాధ్యత వహించాలన్నారు. తమను నిందించడం తగదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పుతిన్ ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ దేశాల ఆటలో రష్యా, ఉక్రెయిన్‌ బాధిత దేశాలుగా మారాయన్నారు. తాము ఉక్రెయిన్‌ ప్రజలపై పోరాడడం లేదని, కేవలం స్వీయ మనుగడ కోసమే పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు.   అందుకే ఇలాంటి అడ్డదారులు  ‘‘పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్‌ బందీగా మారడం విచారకరం. రష్యా పతనమే వాటి లక్ష్యం. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ పోరుగా మార్చడమే వాటి ఉద్దేశం. రష్యా సరిహద్దు వరకూ విస్తరించాలని నాటో కూటమి ప్రయత్నించింది. రష్యా ఉనికిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధం. మాపై యుద్ధం ప్రారంభించింది పశ్చిమ దేశాలే. దాన్ని ముగించడానికి మేం బలాన్ని ఉపయోగిస్తున్నాం. మాపై ‘సమాచార దాడులు’ కూడా జరుగుతున్నాయి. రష్యా సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. యుద్ధక్షేత్రంలో రష్యాను ఓడించడం అసాధ్యమని వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. మా ఆర్థిక వ్యవస్థపైనా దాడి చేస్తున్నారు. కానీ, వారిప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. ఇకపైనా ఏమీ ఉండబోదు.

Daily GK in Telugu(22nd Feb 2023)

1) హతీగుంపా శాసనం వేయించినది ఎవరు.?జ : కారవేలుడు 2) జునాఘడ్/గిర్నార్ శాసనం వేయించినది ఎవరు.?జ : రుద్రాదాముడు3) యయతి చరిత్ర రచించినది ఎవరు.?జ : అద్దంకి గంగాధర4) తపతి సంవర్నోఫాఖ్యాయనం రచించింది ఎవరు.?జ : పొన్నెగంటి తెలంగానార్యుడు 5) తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి అష్ట సూత్ర పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?జ : 1969 6) తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి ఆరు సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?జ : 1972 7) రాష్ట్రపతి ఉత్తర్వులు (ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఉత్తర్వులు) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?జ : 1975 8) భారత రాజ్యాంగంలోని ఐదవ ఆరవ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు ఏవి.?జ : షెడ్యూల్ ఎరియాస్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్ పాలన నియంత్రణ 9) భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘం గురించి వివరించే ఆర్టికల్ ఏది?జ : ఆర్టికల్ 324 10) ఏ కమిటీ నివేదిక ప్రకారం కేంద్రం ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (PDP) – 2019’ ను రూపొందించారు.?జ : బీ.ఎన్. శ్రీకృష్ణ కమిటీ 11) వార్తాపత్రికల సెన్సార్ షిప్ విధించిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు.?జ : వెల్లస్లీ 12) ‘కాకోరి రైల్ దోపిడీ’ ఘటనతో సంబంధం కల్గిన వ్యక్తి ఎవరు.?జ : రాంప్రసాద్ బిస్మిల్ 13) పులిచింతల ప్రాజెక్టు ఏ నది పై నిర్మించారు.?జ : కృష్ణా నది 14) NITI ఆయోగ్ ఏ రోజున ప్రారంభించారు.?జ : జనవరి – 01 – 2015 15) భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏమిటి.?జ : మచిలీపట్టణం 16) పోర్చుగీస్ వారి నుండి గోవాకు స్వతంత్రం ఎప్పుడు లభించింది.?జ : 1961 17) హరప్పా నాగరికత ప్రాంతాన్ని 1921లో ఎవరు కనుగొన్నారు.?జ : దయరాం సాహ్నీ 18) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఎప్పుడు ప్రారంభించారు.?జ : 1945 19) 2004లో హిందూ మహా సమద్రంలో సునామీ కి కారణం అయినా భూకంప కేంద్రం ఎక్కడ ఉంది.?జ : సమత్రా దీవులు (ఇండోనేషియా) 20) భారతదేశంలో తొలి రేడియో ప్రసారాలు 1927లో ఏ నగరాల మధ్య జరిగాయి.?జ : బొంబాయి – కలకత్తా మద్య

Daily Current Affairs in Telugu: 21st ఫిబ్రవరి 2023

IAS-IPS Fight: మహిళా ఐపీఎస్, ఐఏఎస్ మ‌ధ్య‌ గొడవ.. నోటీసులిచ్చిన ప్ర‌భుత్వంకర్ణాటకలో ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌ బహిరంగ ఆరోపణలు, ఆమె ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంపై రగడ రాజుకుంది. దీంతో ప్రభుత్వం ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ ఇద్దరికీ నోటీసులను జారీచేసింది. ఇద్దరూ వేర్వేరుగా రాష్ట్ర సీఎస్‌ వందిత శర్మను కలిసి వివరణ ఇచ్చారు. రోహిణిపై రూపా ఫేస్‌బుక్‌ ద్వారా తీవ్ర ఆరోపణలను చేశారు. దీంతో ఫిబ్ర‌వ‌రి 20న రోహిణి సింధూరి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రూపాకు చికిత్స చేయించాలన్నారు. ప్రచారం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను సేకరించి దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. వీరి వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రమైందిగా భావిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అంటే ప్రజాసేవకులని, ఆ హోదాలకు అవమానం చేశారని అన్నారు. తనకు తెలిసిన మేరకు వారిద్దరూ వ్యక్తిగత సమస్యల వల్లే దూషణలకు దిగుతున్నారని తెలిపారు. రోహిణి భర్త సుదీర్‌ రెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన కంటే పదేళ్లు జూనియర్‌ అయిన రోహిణీ సింధూరికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే రూపా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోహిణి ఫోన్‌ను బ్లూటూత్‌ ద్వారా హ్యాక్‌ చేసి వ్యక్తిగత ఫొటోలను రూపా కాజేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. Niti Aayog: నీతి ఆయోగ్‌ సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యంనీతి ఆయోగ్‌ కొత్త సీఈవోగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. నీతి ఆయోగ్‌ ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌ను ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు సుబ్రహ్మణ్యం ఆ పదవిలో ఉంటారని తెలిపింది. 1987 బ్యాచ్‌ ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌(ఐటీపీవో) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అయ్యర్‌ వాషింగ్టన్‌లో ఉన్న ప్రపంచబ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో ఈడీగా మూడేళ్ల పాటు పనిచేయనున్నారు. సుబ్రహ్మణ్యం విద్యాభ్యాసం.. బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రిది ఒడిశాలోని గుణుపురం కాగా తల్లిది కాకినాడ. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీల్లో చ‌దువుకున్నారు. ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మెకానికల్‌లో బీటెక్‌ చేశారు. తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్‌ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్‌ లా అండ్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. 2004-08, 2012-15 మధ్యకాలంలో మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోదీల హయాంలో ప్రధాని కార్యాలయం, ప్రపంచ బ్యాంకులోనూ పని చేశారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు వెళ్లారు. 2018 జూన్‌లో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019లో ఆ రాష్ట్ర విభజన సమయంలో ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషించారు. ఆయన సతీమణి ఉమాదేవి భమిడిపాటి ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారిగా పనిచేసి ఇటీవల కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు.Supreme Court: లింగ, మతప్రమేయం లేని.. ఉమ్మడి చట్టాలు చేయొచ్చా? శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది.‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్‌ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు.Olaf Scholz: ఫిబ్ర‌వ‌రి 25, 26న‌ భారత్‌లో జర్మనీ అధ్యక్షుడి పర్యటనజర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్‌ షోల్జ్ ఫిబ్ర‌వ‌రి 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్‌ భారత్‌ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్‌ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్‌ పాల్గొంటారు. అదేవిధంగా, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్‌–ఆ్రస్టేలియా క్రికెట్‌ మ్యాచ్‌ను తిలకించనున్నారు.  Digital Payments: భార‌త్‌, సింగ‌పూర్ మ‌ధ్య ఈజీ డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ (మంగ‌ళ‌వారం) కీల‌క‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI), సింగపూర్‌లోని పేనౌ(PayNow)ని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. రెండు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొని డిజిటల్ చెల్లింపు ఒప్పందాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని భారతదేశం నుంచి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ ప్రారంభంభారత్ – సింగపూర్ మధ్య రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ ప్రారంభించారు. దీని ద్వారా భారత్-సింగపూర్ మధ్య సరిహద్దు కనెక్టివిటీ కింద డబ్బును చాలా సులభంగా, త్వరగా బదిలీ చేయోచ్చు. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్ప‌టి నుంచి UPI, PayNowల‌ను ఉపయోగించి, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు, అక్క‌డ చ‌దువుతున్న భారతీయ విద్యార్థులు UPI ద్వారా మ‌న దేశానికి న‌గ‌దు బదిలీ చేయవ‌చ్చు. నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్‌ లావాదేవీలుపెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంతో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI) అమలులోకి వచ్చింది. అనంత‌రం పలు ప్రైవేటు యాప్స్‌ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, భారత్‌పే అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్‌ పేమెంట్‌ విప్లవం ఐదేళ్లలో దేశమంతా విస్తరించింది. ఈ క్రమంలో భారత్‌ ప్రభుత్వం డిజిటల్‌ పేమెంట్స్‌ హద్దులు చెరిపేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌సేఫ్‌(యూపీఐ)ని సింగపూర్‌కి చెందిన ‘పేనౌ’ మధ్య సరిహద్దు కనెక్టివిటీని ప్రారంభించింది.

Daily GK in Telugu (21st Feb 2023)

Daily GK Bits in Telugu for All Competitive Exams(21st February 2023) 1) “విజయ్ ఘాట్” అని ఎవరి సమాధికి పేరు.?జ : లాల్ బహుదూర్ శాస్త్రి 2) శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?జ : అకాస్టిక్స్ 3) ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు.?జ : నవీన శిలా యుగము 4) కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి.?జ : ఆల్బుమిన్ 5) జాతీయ వారసత్వ జంతువు ఏది.?జ : ఏనుగు 6) అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు.?జ : తాన్‌సేన్ 7) ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది.?జ : కన్ను 8) సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు.?జ : కిరోసిన్ 9) భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది.?జ : సామవేదము 10) రసాయనాల రాజు అని ఏ రాశానాన్ని అంటారు.?జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము (H₂SO₄) 11) పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది.?జ : రేనిన్ 12) జయ సంహిత అనే పేరు ఏ మహా గ్రంథానికి ఉంది.?జ : మహాభారతం 13) భారతీయ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది.?జ : 1935 14) సంవత్సరంలో పగలు – రాత్రి సమానంగా ఉండే రోజు ఏది.?జ : మార్చి – 21 15) హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు.?జ : 1887 16) నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు?జ : సాలార్ జంగ్ 17) 1932లో గాంధీ – అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏమిటి?జ : పూనా ఒప్పందం 18) “నారాయణ శతకం” రచించిన కవి ఎవరు.?జ : బమ్మెర పోతన 19) పెన్సిల్, బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏమిటి.?జ : గ్రాఫైట్ 20) రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అనే తెలిపే ఆర్టికల్ ఏది.?జ : ఆర్టికల్ – 37