Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం..
గ్రామీణ ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ ప్రారంభించారు. అక్టోబర్ 21, 2022 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ట్రయల్ రన్ విజయవంతమైంది.
ఏమిటీ విధానం?
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల సంబంధిత వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటారు. ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యంపై డాక్టర్‌కు సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక అనుబంధం ఏర్పడి ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యం.
ఇలా నిర్వహిస్తున్నారు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.
104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు అందిస్తారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాలను మధ్యాహ్నం నుంచి సందర్శించి ఇంటి వద్దే సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.
14 రకాల పరీక్షలు.. 105 రకాల మందులు
గ్రామీణ స్థాయిలో వైద్య వసతులను బలోపేతం చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, నలుగురు నుంచి ఆరుగురు ఆశా వర్కర్లు వీటిల్లో ఉంటారు.
ప్రతి క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లిన వైద్యులు వీటిలో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఎవరైనా రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఫ్యామిలీ డాక్టర్ అక్కడి నుంచే పెద్దాస్ప్రత్రులకు రిఫర్ చేస్తారు. రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రికి తరలించడం, వైద్యం అందేలా చూడటం లాంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్‌ఎం పర్యవేక్షిస్తారు. వీరు విలేజ్ ఆరోగ్యమిత్రగా వ్యవహరిస్తారు.
ICC ODI Rankings: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో శుబ్‌మన్ గిల్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఏప్రిల్ 5న విడుదల చేసిన బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ ఒక స్థానం పురోగతి సాధించి ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌కే చెందిన విరాట్ కోహ్లి ఆరో ర్యాంక్‌లో, రోహిత్ శర్మ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్, కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అతనికంటే ముందున్నారు. సూర్యకుమార్ యాదవ్ టి20 బ్యాటర్లలో అగ్రస్థానంలో, ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
Koneru Humpy: అంతర్జాతీయ చెస్ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపికి ఆరో స్థానం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంతో ముగించింది. గొర్యాక్చినా (రష్యా)తో ఏప్రిల్ 5వ తేదీ జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా హంపి 4.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచింది. షువలోవా (రష్యా)తో జరి గిన చివరి గేమ్‌లో హారిక 66 ఎత్తుల్లో ఓటమి చవిచూసింది. భారత్‌కే చెందిన వైశాలి రెండు పాయింట్లతో పదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.
Sudhir Naik: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ మృతి
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖెడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్(78) ఏప్రిల్ 5న మృతి చెందారు. ముంబైకి చెందిన సుధీర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్‌లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటు లో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్‌లో రంజీ చాంపియన్‌గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు.
Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం
క్రికెట్ నియమావళికి కేంద్ర బిందువైన విఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) 17 మంది మేటి క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం కల్పించింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు ఉన్నారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పేస్ బౌలర్ జులన్ గోస్వామిలతోపాటు ఎమ్మెస్ ధోని, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలకు ఈ గౌరవం దక్కింది. ధోని నాయకత్వంలో భారత్ 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ సాధించింది.
యువరాజ్ సింగ్ ఈ రెండు గొప్ప విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. సురేశ్ రైనా తన 13 ఏళ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 7,988 పరుగులు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అత్యధిక మ్యాచ్‌ల్లో (155) కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గానూ ఆమె గుర్తింపు పొందింది. జులన్ వన్డేల్లో అత్యధిక వికెట్లు (255) తీసిన బౌలర్‌గా ఘనత వహించింది.
MediaOne Channel: వార్తా చానల్ ‘మీడియావన్’పై నిషేధం ఎత్తివేత
మలయాళ వార్తా చానల్ ‘మీడియావన్’పై దేశ భద్రతా కారణాలతో గతేడాది కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్ 5న రద్దు చేసింది. నిజానిజాలు సరిచూసుకోకుండానే నిషేధాజ్ఞలు అమలుచేశారంటూ కేంద్ర హోం శాఖను తప్పుబట్టింది. మీడియాపై అకారణంగా నిషేధం అమలుచేస్తే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిషేధాన్ని సమర్తిస్తూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలుచేసింది.
‘ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించవద్దు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అత్యంత ప్రధానం. పాలనపై వాస్తవాలు వెల్లడించే మీడియా ద్వారా పౌరులు ఒక అభిప్రాయానికొస్తారు. సరైన నిర్ణయాలు తీసుకునే ప్రజల ద్వారానే ప్రజాస్వామ్యం సరైన పథంలో ముందుకు సాగుతుంది. ఏకధృవ పోకడలు, అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయి. ఛానెల్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయకపోవడం భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమే’ అని అభిప్రాయపడింది.
Padma Awards 2023: పద్మ అవార్డులు ప్రదానం చేసిన ద్రౌపదీ ముర్ము
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 5వ తేదీ వీటిని ప్రధానం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి, చినజీయర్ స్వామి పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ ద్రౌపది, ఖాదర్ వలీ, నాగప్ప గణేశ్ కృష్ణరాజనాగర్, అబ్బారెడ్డి నాగేశ్వరరావు తదితరులు ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు.
చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్’ తొలగింపు
దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది. దేశానికి స్వాతంత్య్రం అనంతరం సంభవించిన హిందు, ముస్లిం అల్లర్లకు సంబంధించిన అంశాలను పూర్తిగా తొలగించింది. హిందు, ముస్లింల మధ్య సయోధ్య కోసం మహాత్మ గాంధీ చేసిన ప్రయత్నాలు.. గాంధీ హత్య, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్‌పై నిషేధం, ఇటీవల జరిగిన గోద్రా అల్లర్లు.. అల్లర్ల తర్వాత చోటుచేసుకున్న ఘటనలను 11, 12 తరగతుల రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది.