Published on Feb 25, 2023
Daily Current Affairs in Telugu: 25th ఫిబ్రవరి 2023
Daily Current Affairs in Telugu: 25th ఫిబ్రవరి 2023

Abdul Nazeer: ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
ఏపీ గవర్నర్‌గా ఫిబ్రవరి 24వ తేదీ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ‌భ‌వన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. 1983లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 

HCA Film Awards: ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో 4 అంతర్జాతీయ అవార్డులు 
అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటుతోంది. ఈ సినిమా  ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవ‌డంతో పాటు, ఓ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమాను తాజాగా మరో నాలుగు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ (HCA) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో  RRR  సినిమా అవార్డులు గెలుచుకుంది. దీంతో ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌కు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. ద‌ర్శ‌కుడు రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. 

కాగా బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ  RRR సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌ సినిమా అవార్డులు పొందాయి. హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో పలు విభాగాల్లో విదేశీ చిత్రాలను వెనక్కు నెట్టి మ‌న తెలుగు సినిమా విజయాన్ని అందుకుంది. కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అవార్డ్ అందుకున్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌లోని స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన హెచ్‌సీఏకు కృతజ్ఞతలు తెలిపారు. 

Air India Recruitment: ఎయిర్‌ ఇండియా భారీ నియామకాలు.. 15 వారాల పాటు శిక్షణ 


విమానయాన రంగ సంస్థ ఎయిర్‌ ఇండియా కొత్తగా 5,100 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వీరిలో 900 మంది పైలట్లతోసహా 4,200 మంది విమాన సిబ్బందిని (క్యాబిన్‌ క్రూ) చేర్చుకోనున్నట్టు వెల్లడించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌ నుంచి 470 విమానాలను ఎయిర్‌ ఇండియా సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీయంగా, అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తున్నందున కొత్త నియామకాలు చేపట్టినట్టు  ఎయిర్‌ ఇండియా తెలిపింది. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య 1,900 మందికి పైగా విమాన సిబ్బందిని కంపెనీ చేర్చుకుంది. అభ్యర్థులకు ముంబైలోని ఎయిర్‌ ఇండియా ట్రెయినింగ్‌ సెంటర్‌లో 15 వారాల పాటు తరగతి గది, ఇన్‌ఫ్లైట్‌ శిక్షణ ఇస్తారు.

Qatar Open: ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీ విజేత‌గా బోపన్న–ఎబ్డెన్‌ జోడీ
భారత సీనియర్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న తన కెరీర్‌లో 23వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. దోహాలో ఫిబ్ర‌వ‌రి 25న‌ జరిగిన ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కాన్‌స్టంట్‌ లెస్టిన్‌ (ఫ్రాన్స్‌)–బోటిక్‌ జాండ్‌షుల్ప్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్‌లకు 72,780 డాలర్ల (రూ.60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.  

Shaktikanta Das: ఎకానమీ సవాళ్లను పరిష్కరించాలి.. జీ20 దేశాలకు ఆర్‌బీఐ గవర్నర్ సూచన!
అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌ ఇటీవలి నెలల్లో మెరుగుపడినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్ అన్నారు. గ్లోబల్‌ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు, ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను దృఢ సంకల్పంతో పరిష్కరించాలని కూడా జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీసీ) ప్రారంభ సమావేశంలో దాస్‌ చేసిన ప్రసంగ ముఖ్యాంశాలు..
• ప్రపంచం తీవ్ర మాంద్యం నుంచి తప్పించుకోవచ్చని, వృద్ధి మందగమనం లేదా అంతగా తీవ్రత లేని మాంద్యం పరిస్థితులే సంభవించవచ్చని ఇప్పుడు గొప్ప ఆశావాదం ఉంది. అయితే, ఇంకా అనిశ్చిత పరిస్థితులు మన ముందు ఉన్నాయి. 

• మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను మనం కలిసికట్టుగా దృఢంగా పరిష్కరించాలి. ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు, రుణ ఇబ్బందులు, క్లైమాట్‌ ఫైనాన్స్, వాణిజ్య రంగంలో పరస్పర సహకారం లోపించడం, గ్లోబల్‌ సరఫరాల సమస్యలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పటిష్ట ప్రపంచ ఆర్థిక సహకారంతో ప్రపంచ వృద్ధి విస్తృత స్థాయిలో మెరుగుపరచడం సాధ్యమవుతుంది.  
• జీ20 గ్రూప్‌ ప్రస్తుతం పరివర్తన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి జీ20 ఒక బహుపాక్షిక ఫోరమ్‌గా అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది.

Narendra Modi: మోయలేని రుణ భారంతో దేశాలే తలకిందులు.. మోదీ 
మోయలేని రుణ భారం దెబ్బకు పలు వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా ఇది ప్రమాద సంకేతమేనన్నారు. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ బెంగళూరులో మొదలైన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండు రోజుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. మితిమీరిన అప్పులకు కరోనా కల్లోలం వంటివి శ్రీలంక దివాలా తీయడం, పాకిస్తాన్‌ కూడా అదే బాటన ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి స్థిరత్వంతో కూడిన వృద్ధి బాట పట్టించడం, దానిపై విశ్వాసం పాదుగొల్పడం సంపన్న దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బాధ్యతేనని ఆయన హితవు పలికారు. 
‘‘ఇదంత సులభం కాదు. కానీ నిర్మాణాత్మక ప్రయత్నం జరిగి తీరాలి. అయితే కాలానుగుణంగా సంస్కరించుకుని మారడంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వెనకబడటంతో వాటిపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనిపైనా దృష్టి పెట్టాలి’’ అని అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పుల విపత్తునూ సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో పలుచోట్ల భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కనీస సౌకర్యాలకూ నోచుకోక అలమటిస్తున్న దుర్బల ప్రజానీకాన్ని ఆదుకోవడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు.

Ukraine-Russia Crisis: ఉక్రెయిన్‌పై తీర్మానానికి భారత్‌ దూరం 
ఉక్రెయిన్‌లో యుద్ధానికి తక్షణం తెర పడి సమగ్ర, శాశ్వత శాంతి నెలకొనాల్సిన అవసరముందంటూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఫిబ్ర‌వ‌రి 23న చేసిన తీర్మానానికి భారత్‌ దూరంగా ఉంది. తీర్మానంలోని వ్యవస్థాగతమైన పరిమితుల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 193 సభ్య దేశాల్లో మరో 31 దేశాలు భారత్‌ బాటన నడిచాయి. తీర్మానానికి అనుకూలంగా 141 ఓట్లు, వ్యతిరేకంగా ఏడు ఓట్లు వచ్చాయి. దీనికి మద్దతివ్వాల్సిందిగా ఉక్రెయిన్‌తో పాటు అమెరికా, జర్మనీ తదితర దేశాలు భారత్‌ను కోరాయి. రష్యా, ఉక్రెయిన్‌ రెండింటికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మనం కనీసం దగ్గరగానైనా వచ్చామా అన్నది ఆలోచించాల్సిన అంశమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాం¿ోజ్‌ ఈ సందర్భంగా సూచించారు.
‘‘ఇరుపక్షాలనూ భాగస్వాములను చేయని ప్రక్రియతో ఫలితముంటుందా? ప్రపంచ శాంతిభద్రతలకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో ఐరాస భద్రతా మండలి విఫలమవుతుండటం చేదు నిజం కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఉక్రెయిన్‌ పరిణామాలపై భారత్‌ ఎంతో ఆందోళన చెందుతోంది. సమస్యకు చర్చలే పరిష్కారమన్నదే ముందునుంచీ భారత్‌ వైఖరి’’ అని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌పై గతంలో ఐరాస చేసిన తీర్మానాలకు కూడా భారత్‌ దూరంగానే ఉంది.