Published on Feb 22, 2023
Daily Current Affairs in Telugu: 22nd ఫిబ్రవరి 2023
Daily Current Affairs in Telugu: 22nd ఫిబ్రవరి 2023

YSR Law Nestham: వ‌రుస‌గా నాలుగో ఏడాడి వైఎస్సార్‌ ‘లా నేస్తం’ నిధులు విడుదల 
వ‌రుస‌గా నాలుగో ఏడాడి వైఎస్సార్‌ ‘లా నేస్తం’ పథకం కింద అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభు­త్వం విడుదల చేసింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్ రెడ్డి ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ (బుధ‌వారం) సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయ­వాద వృత్తిలోకి వచ్చిన జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో ఎదు­రయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్‌ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున అందిస్తున్నారు. కాగా ఈ ప‌థ‌కం కింద ఇప్పటివరకు 4,248 మంది న్యాయ­వాదులకు మూడున్నరేళ్లలో రూ.35.40 కోట్లు ఆర్థిక సాయం అందించారు.

అలాగే న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.­100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం అడ్వొకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్‌ సమ­యంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.  

Sania Mirza: వండర్‌ ఉమన్ సానియా మీర్జా టెన్నిస్‌కు వీడ్కోలు.. ఆమె జీవిత విశేషాలివే..  

సానియా మీర్జా అంటే మూడు డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 43 డబుల్స్‌ ట్రోఫీలు, 91 వారాలు వరల్డ్‌ నంబర్‌వన్‌ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 20 ఏళ్ల పాటు టెన్నిస్‌ సర్క్యూట్‌లో ప్రొఫెషనల్‌గా కొనసాగడం మాత్రమేనా? వీటన్నింటికి సమాధానం ‘కాదు’ మాత్రమే!  

మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టడమే అరుదుగా అనిపించిన సమయంలో సానియా టెన్నిస్‌ను ఎంచుకొని కొత్త బాట వేసింది. తన ఆటను, తన సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె టెన్నిస్‌కే పరిమితం కాదు. భారత క్రీడలకే ఆమె ఒక ‘వండర్‌ ఉమన్‌’. 

ఎన్నో ఏళ్లుగా మహిళల క్రీడలకు సంబంధించి ఉన్న మూసను సానియా బద్దలు కొట్టింది. ఆటతోనే కాకుండా అవసరమైతే మాటతోనూ తలపడింది. తన స్థాయి ప్లేయర్‌ను ఒక ‘ఎర’గా వేశారంటూ పురుషాధిక్య సమాజపు నైజాన్ని నేరుగా ప్రశంసించింది. తన ఆటలో సంధించిన ఏస్‌ల తరహాలోనే మాటల్లో కూడా అంతే పదును చూపించింది. 

ఎలాంటి టెన్నిస్‌ నేపథ్యం లేని నగరం నుంచి, సాంప్రదాయ కట్టుబాట్లతో కూడిన తన సొంత నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగిల్స్‌లో 27 వరకు, డబుల్స్‌లో నంబర్‌వన్‌ వరకు సానియా ఎదగగలిగింది. ఒక స్టార్‌గా, దిగ్గజంగా ఆటపై సానియా ముద్ర అసమానం. శ్రమించే తత్వం, పట్టుదలతో ఆమె సాధించిన ఘనతలు స్ఫూర్తిదాయకం. 

Shooting World Cup: ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో రుద్రాంక్ష్‌కు స్వ‌ర్ణం 
ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ భారత్‌ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ బాలాసాహెబ్‌ పాటిల్‌ పసిడి పతకం సాధించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ సేన్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో రుద్రాంక్ష్ 16–8తో మాక్సిమిలన్‌ ఉల్‌బ్రిచ్‌ (జర్మనీ)పై గెలిచాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో రుద్రాంక్ష్ 262 పాయింట్లు, ఉల్‌బ్రిచ్‌ 260.6 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. మిరాన్‌ మారిసిచ్ (క్రొయేషియా; 260.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు.

74 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 629.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ రౌండ్‌కు చేరాడు. టాప్‌–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్‌ రౌండ్‌లో పోటీపడతారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో తిలోత్తమ సేన్‌ 262 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది

Earthquake: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం..   చెన్నైలో కూడా
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ (బుధ‌వారం) మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కొన్ని సెకంన్ల‌ పాటు భూ ప్రకంపనలు వ‌చ్చాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్ర‌కారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదయింది. నేపాల్‌లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్క‌సారిగా కదల‌డంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల్లోని ప్రజలు భయంతో కేకలు వేస్తూ బయటకి పరుగులు తీశారు. కాగా ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

చెన్నైలోనూ భూకంపం
త‌మిళ‌నాడు రాజ‌దాని చెన్నైలోనూ భూమి కంపించ‌డంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం బయటికి పరుగులు తీశారు. మౌంట్‌, వైట్ రోడ్ల‌లో భూమి కంపించింది. అండ‌ర్ గ్రౌండ్ మెట్రో ప‌నుల కార‌ణంగానే భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెప్ప‌డంతో, కాద‌ని మెట్రో నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. 

Supreme Court: సుప్రీంకోర్టు కార్యకలాపాలకు ఇక అక్షరరూపం 
సుప్రీంకోర్టులో జరిగే కార్యకలాపాలు, వాదనలు, తీర్పులు ఎప్పటికప్పుడు అక్షరరూపంలోకి మారి, కక్షిదారులకు ప్రత్యక్షంగా కనిపించే విధానాన్ని ఫిబ్ర‌వ‌రి 21న‌ ప్రారంభించింది. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ), నేచురల్‌ లాంగ్వేజీ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. కోర్టులో పెద్ద తెర ఏర్పాటు చేశారు. వాదనలు, తీర్పులు ప్రత్యక్షంగా ఇందులో కనిపించాయి. అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు చెందిన కోర్టు రూమ్‌లో ఈ లైవ్‌ ట్రాన్ర్‌స్కిప్షన్‌కు శ్రీకారం చుట్టారు. మరో ఒకటి రెండు రోజులపాటు ప్రయోగం కొనసాగనుంది. సత్ఫలితాలు వస్తే శాశ్వతంగా అమలు చేయనున్నారు. వాదనలు, తీర్పులు రికార్డు రూపంలో ఉంటే న్యాయ కళాశాలలకు సైతం ప్రయోజనకరంగా ఉంటుందని సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

Vladimir Putin: ఉక్రెయిన్‌ పరిస్థితికి పశ్చిమ దేశాలే కార‌ణం.. పుతిన్‌
ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభం కావడానికి, ఇదింకా కొనసాగుతుండటానికి అవే బాధ్యత వహించాలన్నారు. తమను నిందించడం తగదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పుతిన్ ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ దేశాల ఆటలో రష్యా, ఉక్రెయిన్‌ బాధిత దేశాలుగా మారాయన్నారు. తాము ఉక్రెయిన్‌ ప్రజలపై పోరాడడం లేదని, కేవలం స్వీయ మనుగడ కోసమే పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు.  

అందుకే ఇలాంటి అడ్డదారులు  
‘‘పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్‌ బందీగా మారడం విచారకరం. రష్యా పతనమే వాటి లక్ష్యం. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ పోరుగా మార్చడమే వాటి ఉద్దేశం. రష్యా సరిహద్దు వరకూ విస్తరించాలని నాటో కూటమి ప్రయత్నించింది. రష్యా ఉనికిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధం. మాపై యుద్ధం ప్రారంభించింది పశ్చిమ దేశాలే. దాన్ని ముగించడానికి మేం బలాన్ని ఉపయోగిస్తున్నాం. మాపై ‘సమాచార దాడులు’ కూడా జరుగుతున్నాయి. రష్యా సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. యుద్ధక్షేత్రంలో రష్యాను ఓడించడం అసాధ్యమని వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. మా ఆర్థిక వ్యవస్థపైనా దాడి చేస్తున్నారు. కానీ, వారిప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. ఇకపైనా ఏమీ ఉండబోదు.