Published on Feb 21, 2023
Daily Current Affairs in Telugu: 21st ఫిబ్రవరి 2023
Daily Current Affairs in Telugu: 21st ఫిబ్రవరి 2023

IAS-IPS Fight: మహిళా ఐపీఎస్, ఐఏఎస్ మ‌ధ్య‌ గొడవ.. నోటీసులిచ్చిన ప్ర‌భుత్వం
కర్ణాటకలో ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌ బహిరంగ ఆరోపణలు, ఆమె ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంపై రగడ రాజుకుంది. దీంతో ప్రభుత్వం ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ ఇద్దరికీ నోటీసులను జారీచేసింది. ఇద్దరూ వేర్వేరుగా రాష్ట్ర సీఎస్‌ వందిత శర్మను కలిసి వివరణ ఇచ్చారు. రోహిణిపై రూపా ఫేస్‌బుక్‌ ద్వారా తీవ్ర ఆరోపణలను చేశారు. దీంతో ఫిబ్ర‌వ‌రి 20న రోహిణి సింధూరి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రూపాకు చికిత్స చేయించాలన్నారు. ప్రచారం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను సేకరించి దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. 
వీరి వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రమైందిగా భావిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అంటే ప్రజాసేవకులని, ఆ హోదాలకు అవమానం చేశారని అన్నారు. తనకు తెలిసిన మేరకు వారిద్దరూ వ్యక్తిగత సమస్యల వల్లే దూషణలకు దిగుతున్నారని తెలిపారు. రోహిణి భర్త సుదీర్‌ రెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన కంటే పదేళ్లు జూనియర్‌ అయిన రోహిణీ సింధూరికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే రూపా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోహిణి ఫోన్‌ను బ్లూటూత్‌ ద్వారా హ్యాక్‌ చేసి వ్యక్తిగత ఫొటోలను రూపా కాజేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Niti Aayog: నీతి ఆయోగ్‌ సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం
నీతి ఆయోగ్‌ కొత్త సీఈవోగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. నీతి ఆయోగ్‌ ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌ను ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు సుబ్రహ్మణ్యం ఆ పదవిలో ఉంటారని తెలిపింది. 1987 బ్యాచ్‌ ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌(ఐటీపీవో) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అయ్యర్‌ వాషింగ్టన్‌లో ఉన్న ప్రపంచబ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో ఈడీగా మూడేళ్ల పాటు పనిచేయనున్నారు. 

సుబ్రహ్మణ్యం విద్యాభ్యాసం.. 
బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రిది ఒడిశాలోని గుణుపురం కాగా తల్లిది కాకినాడ. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీల్లో చ‌దువుకున్నారు. ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మెకానికల్‌లో బీటెక్‌ చేశారు. తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్‌ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్‌ లా అండ్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. 
2004-08, 2012-15 మధ్యకాలంలో మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోదీల హయాంలో ప్రధాని కార్యాలయం, ప్రపంచ బ్యాంకులోనూ పని చేశారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు వెళ్లారు. 2018 జూన్‌లో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019లో ఆ రాష్ట్ర విభజన సమయంలో ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషించారు. ఆయన సతీమణి ఉమాదేవి భమిడిపాటి ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారిగా పనిచేసి ఇటీవల కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు.

Supreme Court: లింగ, మతప్రమేయం లేని.. ఉమ్మడి చట్టాలు చేయొచ్చా? 
శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది.

‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్‌ కొట్టివేత 
స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు.

Olaf Scholz: ఫిబ్ర‌వ‌రి 25, 26న‌ భారత్‌లో జర్మనీ అధ్యక్షుడి పర్యటన
జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్‌ షోల్జ్ ఫిబ్ర‌వ‌రి 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్‌ భారత్‌ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్‌ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్‌ పాల్గొంటారు. అదేవిధంగా, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్‌–ఆ్రస్టేలియా క్రికెట్‌ మ్యాచ్‌ను తిలకించనున్నారు.  

Digital Payments: భార‌త్‌, సింగ‌పూర్ మ‌ధ్య ఈజీ డిజిటల్ పేమెంట్స్ 
డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ (మంగ‌ళ‌వారం) కీల‌క‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI), సింగపూర్‌లోని పేనౌ(PayNow)ని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. రెండు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొని డిజిటల్ చెల్లింపు ఒప్పందాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని భారతదేశం నుంచి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.

రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ ప్రారంభం
భారత్ – సింగపూర్ మధ్య రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ ప్రారంభించారు. దీని ద్వారా భారత్-సింగపూర్ మధ్య సరిహద్దు కనెక్టివిటీ కింద డబ్బును చాలా సులభంగా, త్వరగా బదిలీ చేయోచ్చు. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్ప‌టి నుంచి UPI, PayNowల‌ను ఉపయోగించి, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు, అక్క‌డ చ‌దువుతున్న భారతీయ విద్యార్థులు UPI ద్వారా మ‌న దేశానికి న‌గ‌దు బదిలీ చేయవ‌చ్చు.

నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంతో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI) అమలులోకి వచ్చింది. అనంత‌రం పలు ప్రైవేటు యాప్స్‌ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, భారత్‌పే అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్‌ పేమెంట్‌ విప్లవం ఐదేళ్లలో దేశమంతా విస్తరించింది. ఈ క్రమంలో భారత్‌ ప్రభుత్వం డిజిటల్‌ పేమెంట్స్‌ హద్దులు చెరిపేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌సేఫ్‌(యూపీఐ)ని సింగపూర్‌కి చెందిన ‘పేనౌ’ మధ్య సరిహద్దు కనెక్టివిటీని ప్రారంభించింది.